

హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!
కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా రంగులు పూసుకొని ఆనందంగా గడుపుతుంటారు. హోలీ(Holi) పండుగ ఈ ఏడాది శుక్రవారం(14-03-2025) నాడు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) పలు ఆంక్షలు విధించారు. 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ 6 గంటల వరకు ఆంక్షలు విధించారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు.. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mohanty) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హోలీ రంగులతో ఇబ్బందిపడే వారు ఇంట్లోనే ఉండాలని.. బయటకు వచ్చేవారికి విశాల దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రంజాన్ మాసం(Ramadan Month) కావడం, హోలీ పండుగ శుక్రవారం రావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ వేళ రోడ్ల మీద తిరిగే వారిపై రంగులు చల్లడం కామన్.. అయితే. రంజాన్ మాసం.. పైగా శుక్రవారం కావడంతో ఆరోజున ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది