

రంగంలోకి మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, మార్చి 03: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2.00 గంటలకు మెదక్, సాయంత్రం 5.00 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆమె అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే బుధవారం ఉదయం 11.00 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం 2.00 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5.00 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ల వారీగా నియోజకవర్గాల నేతలు పార్టీ కేడర్‌తో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
మరోవైపు.. వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పార్టీ ఫిరాయింపుల కారణంగా.. ఉప ఎన్నికల వచ్చే అవకాశముంది. ఆ యా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాముందని సమాచారం. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాంటి వేళ.. జిల్లాల్లో నియోజకవర్గాల స్థాయిలో ఉన్న లోపాలను ఎలా సరి చేసుకోని ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించ వచ్చు.
ఇంకోవైపు.. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలిగా ఇటీవల మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో ఆ బాధ్యతలు చేపట్టేందుకు తొలిసారిగా ఆమె హైదరాబాద్ వచ్చారు. తన వస్తున్న సందర్భంగా నగరంలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అలాగే గాంధీ భవన్‌తోపాటు ఆ ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పార్టీ కేడర్‌కు పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అదీకాక.. ఈ బ్యానర్లు, ప్లెక్సీల వల్ల పార్టీ గెలుపు అసాధ్యమని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. ప్రజల మధ్య వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని వారికి పార్టీ వ్యవహారాల బాధ్యులు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు. ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వ్యవహారల బాధ్యురాలిగా దీపా దాస్ మున్షీ ఉన్నారు. ఆమె స్థానంలో మీనాక్షి నాటరాజన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే