

బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్
హైదరాబాద్, మార్చి 6: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్తేజం నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడంతో కమలం పార్టీలో నయా జోష్ వచ్చి చేరింది. ఈ జోష్‌తోనే రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను కూడా రూపొందిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛరిష్మా తెలంగాణలో వర్క్‌అవుట్ అయిందని కమలనాథులు అంటున్న మాట.ఇక అదే ఫార్ములాతో వచ్చే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్లాన్ వేయాలని చేస్తోంది బీజేపీ. త్వరలోనే ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ప్రధాని మోదీతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు సమన్వయం చేస్తున్నారు. కాగా.. ఈరోజు బీజేపీ కార్యాలయంలో రెండు ఎమ్మెల్సీ (టీచర్ ఎమ్మెల్సీ , గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ) లపై గ్రాండ్ గా సంబురాలు చేసుకోనున్నారు.కాగా.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆ పార్టీ బలపరిచిన మల్క కొమరయ్య తొలి ప్రాధాన్యత ఓట్లతో టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ – అదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నరేంద్ర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్ కాగా, 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. మిగిలిన 53 మంది కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ద్వారా బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 93,531 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మోదీ అభినందలు
తెలంగాణలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, అంజిరెడ్డిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ.. ‘‘బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు. ప్రజల మధ్య ఉంటూ వారి కోసం ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.