

‘రోజుకు రూ.30 కూలీకి పనిచేసిన వారికి రూ.70,000 జీతం రానుంది’, సుప్రీం తీర్పుతో ఫలించిన ఏళ్ల కల..!!
“సమాజంలోని ఒక వర్గానికి పరిశుభ్రమైన పరిసరాలను అందించడానికి మరొక వర్గానికి అన్యాయం జరిగే సామాజిక వ్యవస్థ ఉండరాదు”. ముంబయి నగరాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయడానికి పనిచేసే 580 మంది పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని 2023 నవంబర్ 8న ఆదేశాలిస్తూ బాంబే హైకోర్టు న్యాయమూర్తి మిలింద్ జాదవ్ చేసిన వ్యాఖ్యలివి. దీంతో, రెండున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన పారిశుద్ధ్య కార్మికుల పోరాటం హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ముగింపునకు వచ్చినట్లు అనిపించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1996 నుంచి తమ హక్కుల కోసం పోరాడుతున్న 580 మంది పారిశుద్ధ్య కార్మికులు, వారికి మద్దతుగా నిలబడి కోర్టులో వాదించిన చెత్త రవాణా కార్మికుల సంఘం (కచ్ర వాహతుక్ శ్రామిక్ సంఘ్) ఆశలు వదులుకోలేదు, కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో, 2025 మార్చి 3న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ 580 మంది పారిశుద్ధ్య కార్మికులను 1998 సంవత్సరం నుంచి ఉద్యోగులుగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, నగరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను భుజాలపై వేసుకున్న ఈ వర్కర్లు వారి హక్కుల కోసం ఎందుకు ఇన్నేళ్లు పోరాడాల్సి వచ్చింది?
వారికి ఎదురైన సమస్యలేంటి? సుప్రీంకోర్టు తీర్పు వారికి ఎంత కీలకం? .
‘శాశ్వత వర్కర్లుగా మారకుండా ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు’
“మేం గత 28 ఏళ్లుగా కార్మికుల కోసం పోరాడుతున్నాం. ప్రారంభంలో వారికి తాగునీరు అందించడానికి పోరాడాం. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రయాణం ఈ సుప్రీం కోర్టు తీర్పు వరకు చేరుకుంది” అని ముంబయిలోని పారిశుద్ధ్య కార్మికుల సమస్యపై పనిచేసే ‘కచ్ర వాహతుక్ శ్రామిక్ సంఘ్’ ప్రధాన కార్యదర్శి మిలింద్ రనడే బీబీసీతో చెప్పారు. ఈ వర్కర్లు 1996 నుంచి ముంబయిని శుభ్రపరుస్తున్నారని.. అయితే, ఆ సమయంలో వారికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించలేదని ఆయన చెప్పారు. “ఈ వర్కర్లను ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్దతిలో చేర్పించారు. అయితే, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను వారు పొందకుండా చూశారు, వారు ఎప్పటికీ శాశ్వత వర్కర్లుగా మారకుండా ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పేపరు మీద వీరిని కాంట్రాక్ట్ కార్మికులుగా కాకుండా స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేశారు” అని రనడే చెప్పారు. “కార్మిక చట్టం వారికి అమలు కావొద్దని రకరకాల ఏర్పాట్లు జరిగాయి. ఈ వర్కర్లు అందుకున్న డబ్బును జీతం కాదని, గౌరవ వేతనంగా చెప్పారు. 18 మంది కార్మికుల పేర్లను మాత్రమే కాంట్రాక్టర్ వద్ద రిజిస్టర్ చేశారు. ఎందుకంటే 20 కంటే ఎక్కువ మంది కార్మికులు రిజిస్టర్ అయితే, కార్మిక చట్టం ప్రకారం వారికి పీఎఫ్, కనీస వేతనం, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సి ఉంటుంది” అని తెలిపారు. “కాగితాలపై కాంట్రాక్టర్లను ఎన్జీవోల పేరుతో నమోదు చేశారు. కాబట్టి రికార్డుల ప్రకారం, ఈ పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగులు కాదు. దీంతో, ఈ వర్కర్లంతా స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్నారని, వారికి జీతాలు కాకుండా గౌరవ వేతనాలు చెల్లిస్తున్నామని అధికారులు వాదించారు” అని చెప్పారు రనడే. కార్మికులుగా రిజిస్టర్ కాకపోవడంతో కార్మిక చట్టాలు వారికి వర్తించవు. దీంతో ‘కచ్ర వాహతుక్ శ్రామిక్ సంఘ్’ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి వివిధ మార్గాలను అన్వేషించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఆ ఒక్క మార్పుతో..
రనడే మాట్లాడుతూ “ఈ ఉద్యోగులకు అధికారికంగా జీతాలు అందడం లేదు. వారి వద్ద ఎలాంటి హాజరు కార్డులు లేవు. కార్మిక చట్టాలు అమలు చేయలేదు. వారికి తాగునీరు, చేతి తొడుగులు, ముసుగులు, రెయిన్ కోట్లు, ఏమీ ఇవ్వలేదు. అందుకే మేం మొదట ఈ కార్మికులకు తాగునీరు అందించడానికి పోరాడాం. మేం ఏం డిమాండ్ చేసినా వారు కార్మికులు కాదని మునిసిపాలిటీ చెప్పేది. వారు స్వచ్ఛంద సేవకులుగా మాత్రమే పనిచేస్తున్నారని వాదించింది” అని తెలిపారు.
“1997లో మేం ఈ కార్మికులను సంఘటితపరిచాం. 1999 ఆగస్టు 15న జెండా వందనం చేయించడానికి మేం పారిశుద్ధ్య కార్మికులను తీసుకెళ్లాం. ఈ కార్మికులకు కనీసం ఆ రోజైనా సెలవు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అడిగాం. ఆ సమయంలో 365 రోజులూ పనిచేయాల్సి వచ్చేది, ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదు. వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని మేం లేబర్ కమిషనర్‌ను డిమాండ్ చేశాం” అని గుర్తుచేసుకున్నారు రనడే.
“కార్మికులకు సెలవులు ఇవ్వడంతో, ఆ పని చేయడానికి కొత్త కార్మికుల అవసరం పడింది. దీంతో వారు ఆ సమయంలో ప్రతి 18 మంది కార్మికులకు కొత్తగా ముగ్గురిని నియమించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ప్రతి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే కార్మికుల సంఖ్య 21కి పెరిగింది, దీంతో అన్ని కార్మిక చట్టాలు వారికి వర్తించాలి” అని తెలిపారు.
Facebook/Kachra Vahatuk Shramik Sangh1996 నుంచి వారు ముంబయిని శుభ్రపరుస్తున్నారని, కానీ వారికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించలేదని మిలింద్ రనడే చెప్పారు.
ఎంత జీతం రానుంది?
ముంబయిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న దాదారావు పటేకర్ మాట్లాడుతూ “మేం పని ప్రారంభించినప్పుడు, రోజుకు 30-40 రూపాయలు సంపాదించేవాళ్లం. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉండేది. తినడానికి తిండి కూడా లేకుండా నగరానికి వచ్చిన మాలాంటి దళితులకు చీపురుపట్టడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే మాకు ఉద్యోగం కోసం అవసరమైన చదువు, సంబంధాలు ఎప్పుడూ లేవు” అని అన్నారు.
“మేం గత 30 సంవత్సరాలుగా ఇలాగే పని చేస్తున్నాం. కొన్నిసార్లు తాగునీటికి, చెత్తలో పని చేయడానికి గ్లౌస్ కోసం, మరి కొన్నిసార్లు ఆరు నెలలుగా ఆలస్యమైన మా జీతాలను పొందడానికి నిరసనలు చేయాల్సి వచ్చింది. కానీ మేం వెనకడుగు వేయలేదు.” అని అన్నారు దాదారావు.
“నగరాలను శుభ్రం చేసే కార్మికులలో ఎక్కువగా దళితులే. వారికి సామాజిక గౌరవం దక్కదు, జనం కనీసం మనుషులుగా కూడా చూడరు. మేం కాలువలు శుభ్రం చేస్తాం, రోడ్లు ఊడుస్తాం, కానీ ప్రజల దృష్టిలో మేం చెత్తతో సమానం. అయితే, ఈ పని చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. కాబట్టి పోరాడుతూనే ఉన్నాం, చివరికి గెలిచాం” అని అన్నారు దాదారావు పటేకర్.
“ఈ కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని డిమాండ్ చేస్తూ ‘కచ్ర వాహతుక్ శ్రామిక్ సంఘ్’ 2017లో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. 240 రోజులకు పైగా పనిచేసిన కార్మికులను శాశ్వత వర్కర్లుగా నియమించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది” అని మిలింద్ రనడే అన్నారు.
“ఈ కార్మికులందరినీ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో శాశ్వతంగా కొనసాగించాలని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది మాత్రమే కాదు, ఈ కార్మికులు 1998 నుంచి పని చేస్తున్నట్లు చేర్చాలని కూడా సూచించింది” అని ఆయన తెలిపారు.
“1998 నుంచి 2006 వరకు జాతీయ వేతన పెంపు కమిషన్ ప్రకారం ఈ కార్మికులకు జీతాల పెంపుదల ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని వేతనాలను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీని కారణంగా, ఒకప్పుడు రోజుకు 50-60 రూపాయలు సంపాదించే కార్మికులు ఇప్పుడు నెలకు రూ. 70,000కు పైగా జీతం పొందుతారు” అని చెప్పారు రనడే.
ఈ కేసులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఆయన బృందం పారిశుద్ధ్య కార్మికుల తరపున వాదించారు. మునిసిపాలిటీ తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కౌల్ వాదించారు.
అయితే, మున్సిపల్ కార్పొరేషన్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 580 మంది కార్మికులను మునిసిపల్ సర్వీసులో ఉద్యోగులుగా చేర్చాలనే హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం సమర్థించింది