

నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి
దెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి
చెప్పులరిగే దాకా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు
నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు
*శాసనసభలో గళం విప్పిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :-ముధోల్ నియోజక వర్గంలో గతంలో భారీ వర్షాలతో వంద చెరువులు దెబ్బతిన్నాయని, దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. జీరో అవర్ లో శాసనసభలో ఆయన నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. చెప్పులు అరిగేదాకా మంత్రుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. హిప్నెల్లి చెరువు మరమ్మత్తులకు 60 లక్షల రూపాయల నిధులు, దొడర్న చెరువుకు 90 లక్షల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు ఫైనాన్స్ క్లియరెన్స్ కావడం లేదన్నారు. ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ రోడ్డును 100 మీటర్లు తవ్వేశారని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయంలో దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. గత ప్రభుత్వం అమ్మవారి ఆలయానికి 42 కోట్లు మంజూరు చేసి వెనక్కి తీసుకుందని, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ నిధులను ఇచ్చి పనులను ప్రారంభించాలన్నారు. పలుమార్లు బాసర అభివృద్ధిపై మాట్లాడుతుంటే ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయని పనులను ప్రారంభించాలని అసెంబ్లీ సాక్షిగా ఆయన కోరారు. ప్రభుత్వం ఇవ్వకపోతే దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటామని, దీనికోసం అనుమతి ఇవ్వాలన్నారు. వసంత పంచమి వేళ గోదావరి నది ఘట్ల వద్ద రెండు లక్షల మంది పుణ్య స్నానమాచరిస్తే ఏర్పాట్లు లేక భక్తులు ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సంబంధిత శాఖ మంత్రి ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకువస్తామని నోట్ చేసుకుంటున్నట్లు చెప్పారు.