

ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా 2కే రన్ ర్యాలీ ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
మనోరంజని ప్రతినిధి
నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 28
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు 2 కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే విధంగా అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ఈ 2కే రన్ ర్యాలీ ఎన్ టి ఆర్ స్టేడియం వరకు కొనసాగింది. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జిల్లాలో ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బ్యాంకుల ద్వారా మహిళలను అన్ని రంగాల్లో పరిపుష్టం చేయడమే అన్నారు. మహిళా సాధికారితకు బ్యాంకులు అనేక రకాలుగా చేయూతను అందిస్తున్నాయని తెలిపారు. ఆయా పథకాలకు, రుణాలకు అర్హులైన మహిళలందరూ వాటిని సద్వినియోగపరచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళలకు సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల పథకాలపై అధికారులు మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్వయం సంఘాలకు చేయూతనివ్వడానికి ఎన్నో రకాల పథకాలు ఉన్నాయని, మహిళా సాధికారిత సాధించడానికి ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలకు పొదుపుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్యాంకుల సహకారంతో మహిళలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణించగలుగుతున్నారని తెలిపారు. వివిధ వర్గాల మహిళలు, ట్రాన్స్ జెండర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, జెడ్పి సీఈవో గోవింద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ సుభాష్, వెనుకబడిన తరగతుల అధికారి రాజేశ్వర్ గౌడ్, సిడిపిఓ నాగలక్ష్మి, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ అశోక్ కుమార్, ఎస్ హెచ్ జి ల మహిళలు, బ్యాంకర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

