

అల్లు అర్జున్‍కు మరో షాక్..
ఆ చిత్రం లాభాలు పంచాలంటూ పిటిషన్..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రాన్ని వరస వివాదాలు వెంటాడుతున్నాయి. పుష్ప-2 విడుదల సందర్భంగా బెనిఫిట్ షోకి వెళ్లి ర్యాలీ నిర్వహించిన అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సంధ్య థియేటర్‍కు బన్నీ వెళ్లిన సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‍కు తరలించారు. తనపై కేసులు నమోదు కావడంపై తెలంగాణ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, తాజాగా పుష్ప-2 చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమాకు వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం వల్ల పుష్ప-2 సినిమాకు భారీగా ఆదాయం వచ్చిందని, ఆ లాభాన్ని కళాకారులకు పంచాలంటూ న్యాయవాది జీఎల్‌ఎన్ నరసింహారావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వాదనలు వినింది. పుష్ప-2 చిత్రానికి హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చి మరీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని కోర్టుకు జీఎల్ఎన్ నరసింహారావు తెలిపారు. ప్రభుత్వం అలా అనుమతివ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదంటూ ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఈ సినిమా నిర్మాతలు బాగా లాభాలు పొందారని, వచ్చిన ఆ లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలని కోరారు. అలాగే జానపద కళాకారుల పింఛను కోసం పుష్ప-2 లాభాలను కేటాయించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని ఆయన వాదించారు. అయితే, ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసిందని కదా? అని సీజే ప్రశ్నించగా.. వాటి వల్ల వచ్చిన లాభం గురించే పిటిషన్ దాఖలు చేశామని నరసింహారావు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది..