

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి
జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్
పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు
పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని
సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ పోలీసులు వేసిన పీటీ వారెంట్ ను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనుంది. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో ఆయనకు కోర్టులు రిమాండ్ విధించాయి. మరోవైపు అన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరయింది. జైలు నుంచి పోసాని విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు