తెలంగాణలో ఎన్డీయే కూటమి?

తెలంగాణలో ఎన్డీయే కూటమి?

అధ్యాపకులు, పట్టభద్రుల నియోజక వర్గాలకు ఉభయ తెలుగు రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార, ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకోని…

తెలంగాణలో ఎన్డీయే కూటమి?

అధ్యాపకులు, పట్టభద్రుల నియోజక వర్గాలకు ఉభయ తెలుగు రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార, ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ల తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చగా… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిపక్షం తన పద్ధతులు మార్చుకోని పక్షంలో మనుగడే కష్టమన్న హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో అధ్యాపకులు, పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ద్వారా మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో తనదే పైచేయి అని రుజువు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే జరిగింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలోనే అధికారికంగా పోటీచేసింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న ఈ స్థానాన్ని ఇప్పుడు కోల్పోవడం ఆ పార్టీకి దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఆయువుపట్టుగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పరాభవాన్ని మూటగట్టుకోగా బీజేపీ బలపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధ్యాపకుల నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది.

భారత రాష్ట్ర సమితి ఎన్నికలకు దూరంగా ఉండటం బీజేపీకి కలిసొచ్చింది. ముక్కోణపు పోటీ జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేంగానీ, బీజేపీ తెలంగాణలో విస్తరిస్తోందన్న అభిప్రాయం ఈ ఎన్నికల ఫలితాలతో ధ్రువపడింది. అదే సమయంలో కాంగ్రెస్‌ బలహీనపడుతోందన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నాడు చెప్పుకొన్నారు. అదే నిజమైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ మద్దతు పొందిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఓడిపోకూడదు. ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించబోతున్నదా? అన్న సందేహం సహజంగానే ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి కొంత బలంగానే ఉంది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ శాసనసభలో కూడా బలం పెంచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో నేతల సన్నాహాలు!

జాతీయ స్థాయిలో ఎన్డీయేను పటిష్ఠం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీయే ప్రయోగం అమలు చేస్తారా? అన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ సమకూరినప్పటికీ ఎన్డీయే కూటమిగానే ముందుకెళుతున్నాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే… అన్న చర్చ ఇప్పుడు ఆ మూడు పార్టీలలో నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండగా, తెలుగుదేశం పార్టీ ఓట్ల పరంగా అంతో ఇంతో బలంగా ఉంది. జనసేనకు కూడా తెలంగాణలో కొన్ని ఓట్లు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో అది కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవచ్చునుగానీ, ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఎన్డీయే కూటమి ఎందుకు ఏర్పడకూడదు? అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో వినపడుతోంది. గతంలో కలిసి పోటీ చేద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆ పార్టీ అగ్రనేతలు తిరస్కరించారు. దీంతో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. గత ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యతను బీజేపీ నాయకులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్డీయే కూటమి రూపుదిద్దుకోబోతున్నదని పసిగట్టడం వల్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఆయన చంద్రబాబును కేవలం సెంటిమెంటు కోసమే వ్యతిరేకించడం లేదు. ఎన్డీయే కూటమి ఏర్పడితే తెలుగుదేశం, బీజేపీలలో చేరడానికి బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయే కూటమి ఏర్పడుతుందని, ఆ కారణంగానే తాను తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నానని కొంతకాలం క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే ఒకరు నాతో చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు టూ ఎర్లీగా అనిపించాయిగానీ, ఇప్పుడు పరిస్థితులు వేగంగానే మారుతున్నాయి. బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచనలు కూడా మారాయంటున్నారు. తెలంగాణలో ఎన్డీయే కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్‌ మాత్రమే. అందుకే ఆయన చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని మళ్లీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి! బీజేపీతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్‌ నుంచి సంకేతాలు వెళ్లినా… బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కేసీఆర్‌ శకం ముగిసిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోంది. తెలుగుదేశం, జనసేనను కలుపుకొన్నా తామే పెద్దన్న పాత్రను పోషించవచ్చునని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్‌ ‘ఇక లాభం లేదు – జనంలోకి వెళ్లాలి’ అని నిర్ణయించుకున్నారు. ఇక మీదట శాసనసభకు కూడా హాజరవుతానని ఆయన తాజాగా ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉంది. ఈ మూడున్నరేళ్లలో ఏదైనా జరగవచ్చు.

రేవంత్‌కూ హెచ్చరిక…

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీయేకు పురుడు పోయాలన్న ఆలోచన ఊపందుకుంటున్నందున కేసీఆర్‌ మాత్రమే కాదు– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వపరమైన, విధానపరమైన విషయాలను కూడా ముఖ్యమంత్రికంటే ముందుగా మంత్రులు, ఇతరులు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రథసారథి ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా మేల్కొని, రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్‌ పార్టీ సాహసించలేక పోతున్నదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీయే కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూటమి వైపు చూడకుండా రేవంత్‌ రెడ్డి ఎంతవరకు కట్టడి చేస్తారో తెలియదు. మరోవైపు గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో కొందరు పునరాలోచనలో పడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ విషమ పరీక్షను ఎదుర్కొని ప్రభుత్వాన్ని, పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.

ఏపీలో కూటమి కళ…

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అధికార ఎన్డీయే కూటమికి వెయ్యి ఏనుగుల బలం చేకూరింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలలకు జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ పోటీకి పెట్టిన అభ్యర్థులకు 65 శాతం ఓట్లు రావడం విశేషం. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పోటీ చేయకపోయినా, సీపీఎంతో సంబంధాలున్న అభ్యర్థులను పరోక్షంగా బలపరిచింది. వైసీపీ స్వయంగా పోటీ చేసినా ఫలితాల్లో తేడా ఉండేది కాదు. మహా అయితే కూటమికి లభించిన ఓట్ల శాతం కొంత తగ్గేదేమో! అయితే, రాష్ట్ర ప్రజల మూడ్‌ను గమనించి అందుకు అనుగుణంగా తమను తాము సంస్కరించుకొనే బదులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆత్మవంచన చేసుకుంటూ ఆనందం పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలు, జగన్‌ రోత మీడియాలో చేసిన ప్రచారమే ఇందుకు నిదర్శనం. ఉత్తరాంధ్రలో అధ్యాపకుల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులలో ఎవరికి మద్దతు ప్రకటించాలో తేల్చుకోలేకపోయిన కూటమి, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి రెండో అభ్యర్థికి ద్వితీయ ప్రాధాన్య ఓటు వేయాలని సూచించింది. సీపీఎంకు అనుబంధంగా ఉండే యూటీఎఫ్‌ తరఫున పోటీచేసిన మరో అభ్యర్థిని వైసీపీ పరోక్షంగా బలపరిచింది. ఈ నేపథ్యంలో కూటమి మద్దతు పొందిన గాదె శ్రీనివాసులు నాయుడు, వర్మ మధ్యనే పోటీ జరిగింది. శ్రీనివాసులు నాయుడు విజేతగా నిలవగా, వర్మ ద్వితీయ స్థానంలో నిలిచారు. అయినప్పటికీ, ‘కూటమికి ఓటమి’ అని రోత మీడియా ప్రచారం చేయడం ద్వారా ఆత్మవంచన చేసుకుంది. మరోవైపు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అధికారికంగా పోటీచేసిన అభ్యర్థులు ఇరువురూ భారీ మెజారిటీతో గెలిచినా రోత మీడియా విస్మరించింది. తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారని చెప్పడం ఇష్టం లేక ఫలానా వారు గెలిచారని వారి పేర్లు మాత్రమే ప్రసారం చేశారు. ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉంటుందా? మీడియా దాచినంత మాత్రాన ఫలితాలు తారుమారవుతాయా? ప్రజల తీర్పు మారిపోతుందా? అల్ప బుద్ధులు బయటపడతాయి అంతే! క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలను దిక్సూచిగా భావిస్తాయి. కానీ, వైసీపీ రూటే సెపరేటు! మాకు చూపు ఎలాగూ లేదు– అవతలి వాడికి కూడా ఒక కన్ను పోయింది అని ఆనందించినట్టుగా ఉత్తరాంధ్ర ఫలితాన్ని వక్రీకరించి ఆనందం పొందింది. సీన్‌ కట్‌ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి నెగ్గిన గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపు ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకొని తాను కూటమి అభ్యర్థినేనని చెప్పుకొన్నారు. ఈ సన్నివేశం చూసిన తర్వాత వైసీపీ నాయకులుగానీ, జగన్‌ రోత మీడియాగానీ ముఖం ఎక్కడ పెట్టుకుందో తెలియదు. సొంత మీడియా ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన, కూలి మీడియాను పెంచి పోషించినంత మాత్రాన ప్రజాభిప్రాయం మారదు అని మరోమారు రుజువైంది.

కామ్రేడ్ల కష్టాలు!

ఈ సందర్భంగా సీపీఎం గురించి కూడా చర్చించుకోవలసి ఉంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా సీపీఎం ఆయనతో పరోక్షంగా చేతులు కలుపుతూనే ఉంది. జగన్‌ రెడ్డి వంటి వారితో చేతులు కలపడం వల్ల గతంలో ఆ పార్టీకి ఉండిన విశ్వసనీయతను ఇప్పుడు పూర్తిగా కోల్పోయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో సీపీఎం అంటే అంతో ఇంతో నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటుందన్న అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు జగన్‌రెడ్డితో చేతులు కలపడానికి సీపీఐ ససేమిరా అంటూ ఉండగా, సీపీఎం మాత్రం ఎప్పటికప్పుడు ఉత్సాహం ప్రదర్శిస్తూ వచ్చింది. సీపీఐ కలసి రానందున, వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేక పోయినందున సీపీఎం రహస్య అవగాహనతో నడిచింది. జగన్‌ అధికారంలో ఉన్నంత కాలం ఎన్ని అరాచకాలు జరిగినా సీపీఎం పెదవి విప్పలేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఆ పార్టీ పోకడలను ప్రజలు హర్షించలేదు. దీంతో తెలుగునాట సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణరావుకు ప్రజల్లో కొంత విశ్వసనీయత ఉన్నప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఎం విశ్వసనీయత కోల్పోయినందున భారీ తేడాతో ఓడిపోయారు. ఆయనకు వైసీపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడం శాపంగా మారిందన్న అభిప్రాయమూ ఉంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా సీపీఎం నాయకత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఇప్పుడు కేరళకు మాత్రమే పరిమితమై ఒక ప్రాంతీయ పార్టీగా కుదించుకుపోయింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. తెలుగునాట సీపీఎంకు ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు. ప్రజల్లో వారికి విశ్వసనీయత ఉండేది. కానీ, ప్రస్తుత దుస్థితికి ప్రస్తుత నాయకులే ప్రధాన కారణం. నీవు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే స్నేహితులను బట్టి చెప్పవచ్చునని అంటారు. ఇప్పుడు జగన్‌రెడ్డితో రహస్య ప్రేమాయణం సాగిస్తున్నందున ఆ ప్రభావం సీపీఎం పైన పడింది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన యూటీఎఫ్‌ అభ్యర్థి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారంటేనే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లక్ష్మణరావు వంటి వ్యక్తి కూడా పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

జగన్‌ ఇప్పుడేమంటారో..

సీపీఎం సంగతి అలా ఉంచి, జగన్మోహన్‌రెడ్డి విషయానికి వద్దాం! ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. నిన్నటి దాకా ఈవీఎంల ద్వారా మోసం చేశారని అన్నారు. ఇప్పుడు బ్యాలెట్‌ ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమి తన మెజారిటీని పెంచుకుంది. ఇప్పుడేమి చెబుతారు? ఈ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి బలంగా ఉందని రుజువైంది. కొన్ని విషయాల్లో తెలుగు తమ్ముళ్లు ఆవేశపడుతున్నప్పటికీ దాని ప్రభావం ప్రజల్లో లేదని ఈ ఎన్నికలతో స్పష్టమైంది. పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు ఎందుకు వేయాలి? అని కొంత మంది తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా ఓటర్లు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీకి 65 శాతం ఓట్లు లభించడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించుకొని తదనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోకుండా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తానే ముఖ్యమంత్రిని అవుతానని తన చుట్టూ ఉన్నవాళ్లు చెబుతున్న మాటలను నమ్ముతూ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభలో అడుగుపెట్టనని మంకుపట్టు పట్టారు. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించకపోయినా ఆ పార్టీ శాసనసభాపక్షం నాయకుడుగా పి.జనార్దన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. నాటి ఆయన పోరాట ఫలితం కూడా 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడింది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో మంచి వక్తలుగా రాణించిన వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి, ఓంకార్‌, గౌతు లచ్చన్న వంటి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా హోదా పొందినవారు కారు. అంతెందుకు, అవమానాలు తప్పవని తెలిసినా 2019 తర్వాత చంద్రబాబు నాయుడు శాసనసభలో పోరాటం చేయలేదా? తనను తాను వీరుడుగా శూరుడుగా చెప్పుకొనే జగన్‌ రెడ్డి శాసనసభను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియదు. సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్టుగా గవర్నర్‌ ప్రసంగం రోజు మాత్రం కొద్ది నిమిషాల పాటు సభకు హాజరై ఆ తర్వాత ముఖం చాటేశారు. తెలంగాణలో తనకు గురుతుల్యుడైన కేసీఆర్‌ కూడా ఇప్పుడు శాసనసభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రతిపక్షంలో ఉన్న వారికి శాసనసభను మించిన వేదిక మరొకటి ఉండదు.

తానెవరికీ తలవొంచనని చెప్పుకోవాలనే దుగ్ధ జగన్మోహన్‌రెడ్డిలో అధికంగా ఉంది. అందుకే శాసనసభకు వెళ్లి చంద్రబాబు ముఖం చూడ్డం ఆయన నామోషీగా భావిస్తున్నారేమో తెలియదు. నాయకులు ఎవరైనా తమ ఓటమికి కారణాలను గుర్తించి తనను తాను సంస్కరించుకున్నానని ప్రజలకు నమ్మకం కలిగించగలిగినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు కూడా 2019లో ఓడిపోయాక తాను మారతానని ప్రకటించి కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అసలు తాను ఓడిపోయానని కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేని జగన్‌రెడ్డి తనను తాను సంస్కరించుకొనే ప్రయత్నం చేస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై ఆయన అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ–ఎమ్మెల్యేకు తక్కువ అని కించపరిచారు. ఇప్పుడు ఆయనను అవమానించడం అవసరమా? అంటే జగన్‌కు ఎవరు చెప్పాలి? ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని అంటారు. జగన్‌రెడ్డి కూడా తన చుట్టూ ఉన్న వాళ్లు తనకు నిజం చెబుతున్నారా? లేదా? తాను కళ్లు చెవులుగా భావించే రోత మీడియా తనను సరైన మార్గంలో నడిపిస్తున్నదా? లేక తప్పుదారి పట్టిస్తున్నదా? అన్నది స్థిమితంగా ఆలోచించుకోవడం మంచిది. పవన్‌ కల్యాణ్‌ను అవమానించడం అంటే కూటమి ఐక్యతను పటిష్ఠం చేయడమే అన్న చిన్న లాజిక్‌ను కూడా జగన్‌రెడ్డి విస్మరిస్తే ఎలా? నేను ఇంద్రుడిని, చంద్రుడిని అని జగన్‌రెడ్డి భావిస్తారు. ఆయన చుట్టూ ఉండే వాళ్లు కూడా, ‘అన్నా నువ్వు పులివి, సింహానివి’ అని రెచ్చగొడతారు. అలాంటి వారికి నిజాలు కనిపించవు. మంచి మాటలు చెవికెక్కవు. ప్రస్తుతానికి జగన్‌రెడ్డి పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. ఆ దీపం ఎంత కాలం వెలుగుతుందో వేచి చూద్దాం!

  • Related Posts

    53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి..

    కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ…

    ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు

    మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 14 -కల్తీ సరుకులు, నాసిరకం వస్తువులు, నాణ్యతలేన పరికరాలు సాంకేతికంగా మనిషి ఎంత ఎదుగుతున్న తమకు అవసరమైన వస్తువుల కొనుగోలులో మాత్రం ప్రజలకు మోసాలు అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. సగటు మధ్యతరగతి వినియోగదారులు తాము పొందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..

    బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు..