

నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం
భద్రాద్రి, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం నిన్న (గురువారం) నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయం ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాసరామానుజం స్వీకరించారు అన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యల్లో భాగంగా ఆ అర్చకుడిని పర్ణశాల ఆలయానికి బదిలీ చేశారు. ఈ విషయంపై అర్చకులంతా కలిసి ఈవోను కలిసి శ్రీనివాసరామానుజాన్ని మళ్లీ భద్రాచలానికి రప్పించాలని కోరారు. అయితే ఈవో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాము అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించలేమంటూ అర్చకులు నిరసన తెలిపారు. ఈ విషయంలో అర్చకులు, ఈవో మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంకురార్ఫణ ఆరు గంటల పాటు నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఉపప్రధాన అర్చకుడిని ఈవో పిలిపించడంతో నవమి వేడుకలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే.. భద్రాచలం రామాలయం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో రమాదేవికి, వైదిక సిబ్బందికి ఉన్న విబేధాలు పెద్ద రగడకు దారి తీశాయి. భద్రాచలంలో ప్రతీ శ్రీరామనవమికి రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాముల వారి కళ్యాణం అంటేనే లోక కళ్యాణంగా భద్రాచలంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఏప్రిల్ 6న జరుగనున్న సీతారాముల కళ్యాణానికి సంబంధించి నిన్న (మార్చి 12) అంకురార్పణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అంకురార్పణ కార్యక్రమానికి సంబంధించి ఆలయ వైదిక సిబ్బంది శాస్త్ర ప్రకారం చూస్తే ఒక ఏడాది కాలంగా జరగాల్సి ఉత్సవాలన్నింటికీ సంబంధించి ఆచార్య, బ్రహ్మ, రుత్వికగా ఒక కమిటీని నియమిస్తారు. అంకురార్పణ కార్యక్రమంలో బ్రహ్మ స్థానంలో కూర్చోవాల్సిన అర్చకుడిని వేరే ఆలయానికి బదిలీ చేయడం, అర్చకుడిని అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొనకుండా ఈవో అడ్డుకోవడంతో అర్చకులంతా నిరసనకు దిగారు. బ్రహ్మస్థానంలో ఉన్న అర్చకుడు లేకుండా అపచారం చేయమని, రామాలయంలో ఇలాంటి సంఘటన జరగలేదని అర్చకులంతా కూడా మూడున్నర గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. రామాలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాలపట్ల సరైన అవగాహన లేని ఆలయ అధికారిణి పంతాలు, పట్టింపు వల్ల ఆలయ సిబ్బంది మొత్తం కూడా ప్రాధేయపడుతూ, ఒక సంజాయిషీ లేఖ కూడా ఇచ్చి, మూడున్నర గంటల పాటు జాప్యం జరగడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఈవో మెట్టు దిగడంతో ఆ పూజా కైంకర్యాలు రాత్రి పది గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. రామాలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాల గురించి, వైదిక సభ్యుల గురించి అవగాహన లేకుండా ఒక అధికారిణి పంతాలు పట్టింపుల వల్లే ఇదంతా జరిగిందని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలయ ఉపప్రధాన అర్చకులు ఓ భక్తుడి నుంచి బహుమానం తీసుకోవడాన్ని నేరంగా చూసి వేరే ఆలయానికి బదిలీ చేసినట్లు ఈవో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆలయంలో పాలకమండలి లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు