

మనోరంజని ప్రతినిధి ఆర్మూర్ మార్చి 15 – ఆర్మూర్ పట్టణంలో హోలీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండే యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి, ఇతర గ్రామాల్లోనూ పండుగ ఉత్సాహంగా సాగింది. ఉపాధి, చదువు నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు ప్రత్యేకంగా తమ స్వగ్రామాలకు చేరుకుని చిన్ననాటి మిత్రులతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ, సంగీతం, నృత్యాలతో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. ప్రాంతంలోని ప్రధాన వీధులు రంగులతో కళకళలాడాయి. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు.