

హైదరాబాద్ కు వచ్చిన డేవిడ్ వార్నర్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – ఐపీఎల్ పుణ్యమా అని ఇండియన్ క్రికెటర్లు మాత్రమే కాక.. విదేశీ ఆటగాళ్లు కూడా భారతీయ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ప్లేయర్స్ జాబితాలో చేరారు. వారిలో ముందు వరుసలో వచ్చే పేరు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. మైదానంలోనే కాక.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు వార్నర్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగ్స్‌కు తగ్గట్టుగా వీడియోలు చేసి నెట్టింట షేర్ చేస్తూ.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి డేవిడ్ వార్నర్ హైద రాబాద్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడడం లేదు మరి హైదరాబాద్ ఎందుకు వచ్చాడబ్బా?అని అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాకకు కారణం మూవీ ప్రమోషన్స్. అవును.. ప్రస్తుతం వార్నర్ నితిన్ హీరోగా వస్తోన్న రాబిన్‌హుడ్ సినిమాలో నటించాడు. ఈ మూవీలో వార్నర్.. డేవిడ్ పాత్రలో యాక్ట్ చేశాడు. నేడు అనగా ఆది వారం నాడు రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనడం కోసం డేవిడ్ వార్నర్ హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.