

హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక
బహుజనల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ అవసరం
జాతీయస్థాయి ఉద్యమంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ముందుంటుంది
పెంచిన రిజర్వేషన్లను కేంద్రం నుంచి ఆమోదం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి
కొమురవెల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పంటలు ఎండుతుంటే సిగ్గులేకుండా చూస్తూ కూర్చూంటారా ?
రైతులంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకింత నిర్లక్ష్యం ?
ఉద్యమాలతో కాంగ్రెస్ కళ్లు తెరిపించాలి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఎన్డీఎస్ఏ ఎక్కడా ?
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్రకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం
హైదరాబాద్ : హక్కుల కోసం తెలంగాణ నుంచే ఉద్యమ పొలికేక మొదలైందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల కోసం జరగబోయే ఉద్యమం కూడా తెలంగాణనుంచే మొదలవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సి అవసరం ఉందని, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ మొదటి వరుసలో ఉంటాయని అని ప్రకటించారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… “బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ప్రకటన చేశాను. చట్టసభలు బిల్లలు ఆమోదించిన నేపథ్యంలో కొమురవెల్లిలో మొక్కు చెల్లించుకున్నాను. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లును పెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలి. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలి” అని కవిత పేర్కొన్నారు. దేశంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయని, ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలైన తర్వాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలిగిపోయిన నేపథ్యంలో కోర్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదించాలని, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచి వాదిస్తున్నాం అని తెలిపారు. అసెంబ్లీ అవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాజం పరిణితి చెందుతున్నా కొద్ది విస్మరించిన వర్గాలు ఒక్క చోటుకు రావాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేయాలని అన్నారు. బీసీ బిల్లులు అంటే.. ఆ ఒక్క వర్గం లొల్లి కాదు… ఇది అందరి లొల్లి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొమురవెళ్లి మలన్నకు ప్రభుత్వం తరఫున కేసీఆర్ 130 ఎకరాల మాన్యం భూమిని అందించారని, కేసీఆర్ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కొమురవెళ్లి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో చేసిన ఖర్చు రూ 50 కోట్లు అని, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయని అయిన ఒక రిజర్వాయర్ కు మలన్న సాగర్ అని పేరు పెట్టుకోవడం జరిగింది అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మరోవైపు, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేశాయని, ఆ రెండు ప్రాజెక్టులు కలిసి మేడిగడ్డపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా బ్యారేజీకి పర్రెపట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం, ఆ మరుసటి నాడే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ను పంపించడం వంటివి జరిగాయని గుర్తు చేశారు. మరి ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా… ఎన్డీఎస్ఏ వాళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. కాళేశ్వరం నీళ్లు వినియోగించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పోలాలను ఎండబెడుతూ రైతుల నోట్లల్లో మట్టికొడుతున్నదని ధ్వజమెత్తారు. లక్షాలది ఎకరాలు ఎండిపోతున్నా సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు చూస్తూ కూర్చున్నారు తప్పా రైతుల కష్టాలను చూడడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ కళ్లు తెరిపించడానికి రామగుండం నుంచి రగల్ జెండా ఎత్తుకొని కోరుకంటి చందర్ వచ్చారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పై పిడికిలి ఎత్తి పోరాటం చేస్తేనే పోలాలకు నీళ్లు వస్తాయని అన్నారు. నీటి కోసం పాదయాత్ర చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి అభినందనీయమన్నారు. “ఒకప్పుడు తలాపున పారేటీ గోదారి… మన బతుకులు ఎడాది అని పాడుకున్న తెలంగాణను కేసీఆర్ గారు గోదావరి నీటితో చెరువును నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ఎండకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకేలా గోదావరి నీటిని కేసీఆర్ గారు సద్వినియోగం చేశారు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్లనే గోదావరి జలాలను ప్రతీ ఇంటికి చేరాయని స్పష్టం చేశారు. కొమరవల్లిలో జరిగిన కార్యక్రమంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్ల శివశంకర్, యుపిఎఫ్ నేతలు ఆలకుంట్ల హరి, గోపు సదనందు, కొట్టాల యాదగిరి, గురిగి నరసింహ, ఎత్తరి మారయ్య, ఆర్వి మహేందర్, విజేందర్ సాగర్, ఏల్చల దత్తాత్రేయ, కీర్తలత గౌడ్, రాజమళ్ళ బాలకృష్ణ, హమాలీ శ్రీనివాస్, ఎమ్మెస్ నరహరి, కోల శ్రీనివాస్, డి నరేష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, డి కుమారస్వామి, ప్రవీణ్ వంజరా, భాస్కర్ యాదవ్, లోడంగి గోవర్ధన్ యాదవ్, లింగం, కందాల మధు సాల్వా చారి, వీరన్న , రామకోటి శాలివాహన, సంతోష్ కుమార్ వంజరి పాల్గొన్నారు


