హైదరాబాద్, మార్చి 02, 2025: తెలంగాణలో రాజకీయ రంగంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో తన ప్రయత్నాలు కొనసాగించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇటీవల మల్లన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కాలని, కానీ అధికారం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉండిపోతుందని మల్లన్న ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టినట్లు ఉందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ప్రయత్నాలు చేసినా, ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, త్వరలోనే తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి కూడా మల్లన్నకు లభించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్లన్న రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ సాగుతోంది.