

Press Release
సాయం అందించే చేతులకు వేదిక పీ4
సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యం
ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు
అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’
మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం
ఉగాది రోజున అమరావతిలో పీ4 ప్రారంభం
పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, మార్చి 24: రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని…గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. పేదలకు మద్దతుగా నిలిచేందుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. పీ4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదని చెప్పారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి అన్నారు. లద్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబానికి ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని చెప్పారు. గ్రామసభ, వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందని అన్నారు. పీ4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎటువంటి సంబంధం లేదని సీఎం అన్నారు. పీ4 కార్యక్రమం అనేది సమాజంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం అని అన్నారు. పీ4, ప్రభుత్వ పథకాల అమలుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు అధికారులు తావివ్వకూడదని తెలిపారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే పీ4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతిగ్రామం నుంచి ఒకరైనా హాజరయ్యేలా, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పేదరిక నిర్మూలన – జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యం చేరే వరకు పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.
