సవితమ్మ శభాష్!
మానవత్వం చాటుకున్న మంత్రి సవితపై ప్రశంసలు
పెనుకొండ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. తీవ్రంగా గాయపడి బాధతో విలవిలాడుతూ, రోడ్డుపై నిస్సహాయంగా పడివున్న వ్యక్తిని గుర్తించి తన ఎస్కార్ వాహనంలో ఆసుపత్రికి పంపించారు. అక్కడితో తన పని అయిపోయిందని భావించకుండా, బాధ్యయుతమైన నాయకురాలిగా స్పందిస్తూ, ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. మంత్రి సవిత స్పందించిన తీరును చూసి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన పెనుకొండ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పట్టణంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత తన స్వగ్రహానికి పయనమయ్యారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు రాగానే, రోడ్డుపై యాక్సిండ్ గురైన వ్యక్తి నిస్సహాయంగా పడిఉండడాన్ని మంత్రి గమనించారు. తక్షణమే తన కాన్వాయ్ ను ఆపి, క్షతగాత్రుడిని పరిశీలించారు. తీవ్ర గాయం కావడంతో విలవిలలాడుతున్న బాధితుడిని తన ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులకు ఫోన్ చేసి, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలపాలని స్పష్టం చేశారు. మంత్రి సవిత ఆగమేఘాలపై స్పందించిన తీరును చూసి పెనుకొండ వాసులు అభినందించారు. గతంలోనూ పలు ప్రమాద సంఘటనలో మంత్రి స్పందించిన తీరును గుర్తు చేసుకుంటూ, ప్రశంసలు కురిపించారు.