

వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 18 :- వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు షెడ్యూల్ ప్రకారం ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ త్రాగు నీటిని అందించాలన్నారు. బస్టాండులు , ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని, త్రాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పశువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు బావులకు మరమ్మత్తులు చేయాలన్నారు. త్రాగు నీటి వృదాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట త్రాగు నీటి పైపులకు మరమ్మత్తులు చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాల గుర్తింపును వెంటనే పూర్తిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగివున్న ప్రతీ ఒక్కరికీ ఉపాధిని కల్పించాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున, ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాలలో టెంట్లను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ పొట్లాలు సరిపడినన్ని ఉపాధి హామీ ప్రదేశాలలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైనచోట ఈజీఎస్ నిధుల ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు.
అనంతరం పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా మండలాల పరిధిల్లోని ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్న ఆదాయ, కుల, నివాస, తదితర పౌరసేవల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ వెంట వెంటనే పూర్తిచేయాలన్నారు. మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న పలు పౌరసేవల ధ్రువీకరణ పత్రాల వివరాలను తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, జెడ్పి సిఈఓ గోవింద్, అన్ని మండలాల తహసిల్దార్ లు, ఎంపిడిఓలు, ఎంపిఓ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు


