రెండవ ఆసియా యోగాసనా
పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న భారత్
16 దేశాల నుండి పాల్గొననున్న
యోగ క్రీడాకారులు
హర్షం వ్యక్తం చేసిన నందనం కృపాకర్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి, 05 :- రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం పట్ల యోగాసన భారత్ జాతీయ సంయుక్త కార్యదర్శి నందనం కృపాకర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్షిక్ మండవియా పోటీలకు సంబంధించిన వివరాలను ఇటీవలే విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈనెల 29 నుండి మూడు రోజులపాటు ఢిల్లీలోని
ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోటీలకు యోగాసనా భారత్,ఏసియన్ ఒలంపిక్ కౌన్సిల్, ఇంద్రప్రస్థ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారం అందిస్తున్నాయని కృపాకర్ చెప్పారు.ఒలంపిక్స్ లో యోగాసనాన్ని చేర్చడమే లక్ష్యంగా ఆసియా యోగాసన, యోగాసనా భారత్ ముందుకు వెళ్తున్నాయని తెలిపారు.
యోగాసనా అసోసియేషన్ ఆసియా ప్రాంత అధ్యక్షుడు సంజయ్ మాల్పాని,ఆయన బృందం కొంతకాలంగా జరిపిన విశేష కృషి ఫలితంగానే ఢిల్లీలో ఆసియా స్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ నిర్వహణకు నాంది పడిందన్నారు.ఈ సందర్భంగా ఆసియా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు,బృందానికి అభినందనలు తెలియజేశారు.మూడు రోజుల పాటు జరిగే ఛాంపియన్షిప్ పోటీలకు ప్రపంచంలోని 16 దేశాల నుండి యోగాసనా క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు.
దేశం నుంచి ఎంపిక చేయబడ్డ యోగాసన క్రీడాకారులకు ఈనెల16 నుండి రెండు రోజులపాటు పాటీయాలా
లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.ఇందులో ప్రతిభను కనబరిచిన యోగాసన క్రీడాకారులకు పది రోజులపాటు యోగాసన భారత్ శిక్షణ ఇస్తుందని, తదనంతరం ఆసియా ఛాంపియన్షిప్ పోటీలలో వీరు పాల్గొంటారని నందనం కృపాకర్ తెలియజేశారు. శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుండి ఒకరిద్దరిని పంపడానికి పరిశీలన ప్రారంభమైందని త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి,యోగాసన క్రీడను విశ్వక్రియలుగా మార్చడానికి యోగాసనా ఏషియా వరల్డ్, యోగాసన భారత్ నిరంతర కృషిని కొనసాగిస్తున్నాయని త్వరలోనే ఆ స్వప్నాన్ని సాకారం చేసుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖచే గుర్తింపు ఉన్న ఏకైక యోగాసన ఫెడరేషన్ యోగాసనా భారత్ మాత్రమేనని, యోగాసన భారత్ నిర్వహించే క్రీడలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారు విద్య, ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు, కోచ్ లు గమనించాలని కృపాకర్ విజ్ఞప్తి చేశారు.