

మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా అల్లం నారాయణ
హైదరాబాద్: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అల్లం నారాయణకు కేబినెట్ ర్యాంకులో ఈ హోదాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున కీలక పాత్ర పోషించిన ఆయనను సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజలతో పాటు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణిలను ప్రజాపాలనలో సముచితంగా గౌరవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో, మీడియా రంగంలో విశేష సేవలందించిన అల్లం నారాయణ అనుభవాన్ని ప్రజాపాలనలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర సర్కారు మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు తెలిసింది