

వేములవాడ రాజన్న కళ్యాణం
మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…
మనోరంజని ప్రతినిధి వేములవాడ :- మార్చి 16 :- ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కమనీయమైన ఈ కళ్యాణం తిలకించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలనుండి భక్తులు తరలివస్తారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. కళ్యాణానికి ముందు ఎదుర్కోలు కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతుంది. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య ఘనంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడి ఆలయంలో కోడె మొక్కులకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. సంతానం కోసం, తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలని కోరుకుంటూ శివుడికి భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు చాలామంది తమ పిల్లలకు ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించడం ఆనవాయితీ. ఇలా అనేక రకాలుగా వేములవాడ రాజన్న ఆలయానికి విశేష ప్రాధాన్యముంది. తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్న వేములవాడ పుణ్యక్షేత్రం రాజధాని హైదరాబాదు 160 కిలోమీటర్లు, కరీంనగర్ కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతల కలిగివుంది. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలుచుకునే ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో ఉంది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం కనిపించిందట. దానిని అక్కడ ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కలిగించాడు. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం సందర్భంగా దేవాలయాన్ని సుందరంగా అలంకరిస్తారు. విద్యుత్ దీపకాంతులతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తారు. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామిని రాజన్న అనీ భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీలక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మితమయ్యాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠితమయి ఉంటుంది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి. ఇక్కడ భక్తులు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం మరో ప్రత్యేకతగా చెప్పుకుంటారు. *సూర్యుడు ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని ఆరాధించాడట. అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరు వచ్చినట్లు చెబుతారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీసీతారామ లక్ష్మణులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు చేశారట. అలాగే పంచపాండవులు కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి వారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణం చెబుతోంది. అనారోగ్యాలు, ఇతర కష్టాల్లో ఉన్న మహిళలు అవి తీరాలని స్వామి వారికి మొక్కుకొని, అవి తీరాక జీవితాంతం బిక్షాటనే వృత్తిగా చేసుకొని, పార్వతిగా మహా శివునికే అంకితమై పోతారు. అలాంటి వారు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉండడం ఇక్కడి ఇంకొక విశేషం.