

మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. లోకేష్ సేవాగుణంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా.. లోకేశ్ క్షణాల్లో స్పందించడంతో ఒకరికి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరుగనుంది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్‌కు గురి అయ్యారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. సుష్మ అవయవదానంతో తిరుపతిలో మరొకరికి ప్రాణదానం జరుగనుంది. సుష్మ గుండెను తిరుపతిలోని మరొకరికి అమర్చనున్నారు. గుంటూరు నుంచి తిరుపతికి గుండెను తరలించడానికి సొంత ఖర్చులతో మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇవాళ(గురువారం) రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను గుంటూరు రమేష్ ఆస్పత్రి సిబ్బంది తిరుపతికి తరలించనున్నారు. దీంతో గుండె మార్పిడి విజయవంతం చేయడానికి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్‌కు సుష్మ కుటుంబ సభ్యులు, రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.