

,మయన్మార్ అతి భారీ భూకంపం : 7.7 తీవ్రతతో ఊగిపోయిన దేశం : బ్యాంకాక్ లో కూలిన 20 అంతస్తుల భవనం..
మయన్మార్ దేశంలో ఊగిపోయింది.. వణికిపోయింది. భారీ భూకంపంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఊగిపోయాయి. మయన్మార్ దేశంలో మండలే జిల్లా కేంద్రం అయిన మండలే పట్టణం కేంద్రంగా ఈ భూకంప కేంద్రం ఉంది.
భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ కేంద్రం ఉండటంతో.. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్కర్ స్కేల్ పై 7.7 గా నమోదైనట్లు ప్రకటించింది.
2025, మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైనదని.. ప్రమాదకరమైనదిగా చెబుతోంది. భూకంపం వచ్చి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అయ్యిందని.. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.
భూకంపం తీవ్రత 7.7గా ఉండటంతో.. బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి. ఆఫీసులు, ఇళ్లల్లోని జనం బయటకు పరుగులు తీశారు. బర్మాలోని ఓ షాపింగ్ మాల్ లో భూకంపం ధాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మంటలు వచ్చాయి. మరో ఘటనతో.. ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడటం కనిపించింది. ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.