

బ్యాంకాక్ భూకంపం.. క్షేమంగా హైదరాబాద్‌కు తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం
హైదరాబాద్: థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి. శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి.. వందల నిర్మాణాలు కుప్పకూలాయి. మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో కలిపి వందల మంది మృతి చెందారు.. చాలా మంది గాయపడ్డారు. రెండు దేశాల ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. జనాలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం బ్యాంకాక్‌లో చిక్కుకుపోయారు. వారు క్షేమంగా ఇంటికి చేరాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థించారు.వారి ఆకాంక్షలు ఫలించి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. .తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం.. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. భార్యాబిడ్డలను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను చూసి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ భార్య మాట్లాడుతూ.. “ఓ పెళ్లికి హాజరుకావడం కోసం నేను, నా కుమార్తె మానస, కుమారులు ప్రతీష్, నిధీష్‌లతో కలిసి బ్యాంకాక్ వెళ్లాము. అక్కడ నొవాటెల్ హోటల్‌లోని 35వ అంతస్తులని ఓ గదిలో దిగాం. శుక్రవారం ఉదయం అక్కడ భూకంపం వచ్చింది. వెంటనే స్పందించి.. నా బిడ్డలను తీసుకుని మెట్ల మార్గం గుండా వేగంగా బయటకు వచ్చాను. కానీ భూప్రకంపనల ధాటికి భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోయాయ.. బిల్డింగ్ ఓ పక్కకు ఒరిగిపోయింది. మృత్యువు నుంచి తప్పించుకోలేమని అర్థం అయ్యింది. కానీ ఏదో ఆశతో.. బయటపడేందుకు ప్రయత్నాలు చేశాం. మా అదృష్టం బాగుండి.. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చాం. మేం బిల్డింగ్ నుంచి బయటకు రాగానే.. మా కళ్లెదుటే.. పేకమేడల్లా భవనాలు కూలిపోవడం చూసి షాక్‌కు గురయ్యాం. తిరిగి ఇండియా వస్తాము అనే ఆశ లేదు. కానీ మా అదృష్టం బాగుండి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాం” అని ఎమ్మెల్యే భార్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.