

బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ఏ, బీ, ఈ వర్గాల నేతలు పాల్గొన్నారు.సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. కుల గణన ప్రకారం మొత్తం బీసీలు 56% ఉండగా, కేవలం 42% రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని అన్నారు. హిందూ బీసీలకు 46%, ముస్లిం బీసీలకు 10% ఉన్నా, బీసీ ముస్లింలను మినహాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించిన నాయకులు, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు న్యాయస్థానాల్లో నిలవవని హెచ్చరించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో షేర్ ఆలీ, ఎండి షబ్బీర్, జమీల్, ఎండి దావూద్, అద్నాన్ ఖమార్, శుక్రోద్దీన్, భాషా, ఎండి ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
