Breaking ; బీసీలకు రాజ్యాధికారం వచ్చేదాకా ఊరుకోం !
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వాఖ్యలు
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ;
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. బుదవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్న బీసీవాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజు నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర ప్రతి ఒక్కరూ బానిసలుగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. కానీ, తీన్మార్ మల్లన్న విషయంలో అది సాధ్యం కాదని అన్నారు.
తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమను తొలగించుకోవాలని హెచ్చరించారు. తాము వెనుకటి బీసీలం కాదని.. ఆధునీకరించుకుని, ఆలోచన మెరుగుపరుచుకుని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులమని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని.. సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు, ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగులబెట్టానని క్లారిటీ ఇచ్చారు. బీసీకు న్యాయం జరగాలని కోరి తగులబెట్టడం తప్పు అయితే.. ఆ తప్పును తాను వెయ్యి సార్లు చేస్తానని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కులగణన చేయబోతున్నాం, తమ జన్మలు సార్థకం అయ్యాయంటూ ప్రభుత్వ పెద్దలు డైలాగులు కొట్టారని.. సర్వేను తప్పుదోవ పట్టించారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలని ఉంటే.. సర్వే ప్రారంభమైన తొలిరోజే సీఎం ఆయన ఇంట్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ఇళ్లలో సర్వేలో పాల్గొని అందరికీ ఆదర్శంగా ఉండేలా చూపించే వాళ్లని కామెంట్ చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమి జరగలేదని ధ్వజమెత్తారు.