

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు.. 5జీ సేవలకు ముహూర్తం ఫిక్స్
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. కస్టమర్లకు తీపి కబురు ప్రకటించింది. త్వరలోనే దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
జూన్ నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించారు. ఈ క్రమంలోనే 5జీ నెట్‌వర్క్ విస్తరణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సేవలను ముందుగా ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని స్పష్టంచేశారు.
అలానే ఢిల్లీలో 5జీ సేవలను ప్రారంభించిన తర్వాత పలు నగరాలకు సైతం ఈ సేవలను విస్తరించనున్నారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుందని వెల్లడించారు. కాల్స్ విషయంలో కూడా క్వాలిటీ మరింత పెరుగుతుందని వివరించారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బీఎస్ఎన్ఎల్ ను పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 80,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. నూతన సాంకేతికతను అందించడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. గత ఏడాది జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNL నెట్‌వర్క్‌కి మారారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లోనే లక్షల మంది ఒక్కసారిగా BSNLకి మారారు.
ఇప్పుడు 5జీ కూడా అందుబాటులోకి వస్తే యూజర్ల సంఖ్య మరింత పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రూ. 1499 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ అంతకు ముందు 336 రోజులకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆఫర్లో మరో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి మొత్తం 365 రోజులకు ప్లాన్ వర్తించనుంది. అంతే కాకుండా ఈ ప్లాన్ తో Lystn Podcast, Zing Music, BSNL Tunes సహా పలు సేవలను ఉచితంగా పొందవచ్చు.