

బీఆర్‌ఎస్ సభకు 3 వేల బస్సులు..
ఆర్టీసీకి బస్సుల కోసం రూ.8 కోట్లు చెల్లింపు
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ
నేడు గ్రేటర్ పరిధిలోని నేతలతో సమావేశం
త్వరలో నియోజకవర్గాలకు ప్రచార సామగ్రి
రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరం
హైదరాబాద్: వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్‌ఎస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలవారీగా పార్టీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా జన సమీకరణపై పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేశారు. గ్రామాలవారీగా లెక్కలు వేసుకుంటూ వాహనాలు సమకూర్చుకుంటున్నారు. సభకు తరలివచ్చే ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తల కోసం 3 వేల బస్సులు సమకూర్చాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి దరఖాస్తు చేసింది. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. బస్సులకు అద్దె కోసం రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు అందజేశారు.
ఉమ్మడి వరంగల్ నేతలతో కేటీఆర్ భేటీ
ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు. జన సమీకరణపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం రెండున్నర లక్షల మందిని సభకు తరలించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్య నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశాలను ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పార్టీ ఇచ్చే ప్రచార సామగ్రిని క్షేత్ర స్థాయికి చేరవేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. పార్టీ కండువాలు, జెండాలు, వాల్ పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘స్వరాష్ట్రాన్ని సాధించాం.. సగర్వంగా నిలబెట్టాం’నినాదంతో ‘ఛలో వరంగల్’పేరిట రూపొందించిన రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను ఒకటిరెండు రోజుల్లో కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.
నేడు ‘గ్రేటర్’నేతలతో సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం ఉదయం 10.30కు తెలంగాణ భవన్‌లో జరగనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ భేటీని సమన్వయం చేస్తారు. సభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జన సమీకరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గ్రేటర్ పరిధిలోనే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో జన సమీకరణను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.