

ప్రజలు సమస్యలు వేగంగా పరిష్కరించండి …

కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు
మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 07 :- ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.మండల ప్రత్యేక అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందజేయాలన్నారు. నూతన పథకాలు అమలు, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాలలో ఆఫ్ లైన్ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రసీదును ఇవ్వాలన్నారు. స్వయం ఉపాధికై రాజీవ్ యువ వికాసం పథకానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ పథకానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. అధిక ఉష్ణోగ్రతల కారణంగా, జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజల అర్జీలను ఫోన్ ద్వారా స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, సంబంధిత అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా సోమవారం టెలిఫోన్ ప్రజావాణి ద్వారా 10 మంది దరఖాస్తుదారులు తమ అర్జీలను సమర్పించారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి. ప్రజావాణిలో సమస్య నమోదుకు సంబంధించి రసీదును సంబంధిత వ్యక్తులకు వాట్సప్ ద్వారా అందించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు