

Press release
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ప్రజలు నాపై బాధ్యత పెట్టారు, కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందాం
పారిశుద్ధ్యం నిర్వహణలో మంగళగిరిలో మార్పు కనిపిస్తోంది
పరిశుభ్రత కోసం అందరి సహాయ సహకారాలు కావాలి
ఆల్ఫా టీ స్టాల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో మంత్రి లోకేష్
మంగళగిరిః పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలు తనపై బాధ్యత పెట్టారని.. అందరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఆల్ఫా టీ స్టాల్ వద్ద పారిశుద్ధ కార్మికులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలంతా నిద్రపోయే సమయానికి పారిశుద్ధ కార్మికులు మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారు. కార్మికులు అద్భుతంగా పనిచేస్తున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణలో గడచిన 10 నెలల్లో మంగళగిరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకువచ్చి రోడ్లపై చెత్త వేయకుండా చూడాలి. పారిశుద్ధ్యం, స్వచ్ఛతలో దేశంలోని అన్ని కార్పోరేషనల్లో మంగళగిరిని నెం.1గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వారిని కూడా భాగస్వామ్యం చేయాలనేది చంద్రబాబుగారి ఆలోచన. పారిశుద్ధ్యం నిర్వహణకు అవసరమైన సామాగ్రిని కూడా రూ.90 లక్షలు వెచ్చించి అందుబాటులో ఉంచాం.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ముఖాముఖిలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో జనాభా పెరిగారని, కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. వాహనాల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, వాహనాల సంఖ్య పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని పలువురు కార్మికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గతంలో ఆప్కాస్ ద్వారా గందరగోళం సృష్టించారని, ఇప్పుడు కార్పోరేషన్ లో విలీనంతో సమస్య ఉండదని, ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులకు మరుగుదొడ్ల సౌకర్యం, కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని కోరారు. మంగళగిరిలో మొదటి విడతలో 6 మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తామని, భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్ పైప్ లైన్ నిర్మిస్తామని, జూన్ నాటికి పనులు ప్రారంభించి ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూగర్భ గ్యాస్, పవర్ కూడా అందిస్తాం. పారిశుద్ధ్యం నిర్వహణను స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు.
ఇళ్లు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం
మంగళగిరిలో త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం. 11వేల మందిని అర్హులుగా గుర్తించాం. ఇళ్ల పట్టాలు అందించిన తర్వాత ఇళ్లు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం. టిడ్కో ఇళ్ళ సముదాయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం. కమ్యూనిటీ భవనాలు, పార్క్ లు, చెరువులు అభివృద్ధి చేస్తాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు వైద్యం అందిస్తాం. ఆవులు, శునకాలు, పందుల సమస్యను పరిష్కరిస్తాం. వీధి దీపాలు ఏర్పాటుచేస్తాం. అన్ని రంగాల్లో మంగళగిరిని నెం.1 గా తీర్చిదిద్దుతాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రజలు నాపై బాధ్యత పెట్టారు. అందరూ కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందాం. స్వర్ణకారులకు అండగా ఉంటాం. అమరావతి నిర్మాణ పనులు ఏప్రిల్ నుంచి మొదలుపెడతాం. గంజాయి నియంత్రణకు యుద్ధమే చేస్తున్నామని చెప్పారు. ఆరు నెలలకు ఒకసారి సమావేశమై మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులను మంత్రి లోకేష్ సత్కరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు. సామాన్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.


