

పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ అండ తప్పనిసరి –

మాజీ సర్పంచ్ రాజేందర్ డిమాండ్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముధోల్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పారిశుద్ధ్య కార్మికుడు సొన్ కాంబ్లే శంకర్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాద ఘటనపై ముధోల్ మాజీ సర్పంచ్ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం కనీస వేతనం, పెన్షన్, జీవిత భీమా, హెల్త్ ఇన్సురెన్స్ ఇవ్వాలని, అలాగే నెల మొదటి తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుడి మరణించిన ప్రతి సందర్భంలో బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. “వేల కోట్లు ఉచిత పథకాలకు ఖర్చు చేస్తూన్న ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి,” అని రాజేందర్ హితవిచ్చారు. డిమాండ్లు:
పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి
లేబర్ చట్టాల ప్రకారం కనీస వేతనం అందించాలి
జీవిత భీమా, హెల్త్ ఇన్సురెన్స్ అమలు చేయాలి
నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలి
మృతి చెందిన కార్మిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని కోరారు.