

తెలుగువారి తొలి పండగ… ఉగాది!..
రుతువులు మారుతుంటాయి…. వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు. శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువు గానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం.అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ… ఉగాది!
పంచాంగ శ్రావణం…
ఉగాది నాడు విధిగా పంచాంగ శ్రవణమూ ఉంటుంది. ఇందులోనూ పరమార్థముంది.ఇది మన ఖగోళశాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం.ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు.ఇందులో ఐదు అంగాలుంటాయి.
ఐదు అంగాలు..
తిథి,వారం,నక్షత్రం, యోగం,కరణం లను పంచాంగం అంటారు.చంద్రుని నడకకు సంబంధించిన దితిథి.వారంలోని ప్రతిరోజునీ ఒకగ్రహానికి అధిదేవతగా భావించి ఆరోజును ఆగ్రహం పేరుతో పిలుస్తారు. రాశిచక్రంలోని 27నక్షత్రాల్లో ఏరోజున ఏనక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆరోజు ఆనక్షత్రం ఉన్నట్లు చెబుతారు. నక్షత్రరాశిలో సూర్యచంద్రులు ఉన్నట్లు భావించి యోగం లెక్కగడతారు.ఇకతిథిలోఅర్ధభాగం కరణం.ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఇదిఉపయోగపడు తుంది.ముఖ్యంగా ఈఏడాది వాతావరణంఎలా ఉండబోతుందీ ఏయేపంటలు వేస్తేమంచిదీ వంటి విషయాలన్నీ రైతులు తెలుసుకుంటారు.కొన్నిప్రాంతాల్లో సాగుపనులనూ ఈరోజే లాంచనంగామొదలు పెడతారు.
మనందరికీ తెలిసిన ఈ పద్ధతులే కాదు,ఉగాది నాడు ఆచరించేవి ఇంకాకొన్ని ఉన్నాయి.
ధ్వజారోహణం:వాకిట్లో ధ్వజాన్ని నిలిపి దానికి చిగుళ్లూ కొమ్మలూ కడతారు.దీన్నే బ్రహ్మధ్వజం అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడనడానికి గుర్తుగాదీన్నినిలబెడతారు.. మహారాష్ట్రీయులు ఈఆచారాన్ని ఇప్పటికీ తప్పకపాటిస్తారు.
ఆకులూ పువ్వులతోరణాలతో ఇంటిని అలంకరిస్తారు.
దవనోత్సవం:పరిమళపత్రమైనదవనం ఈకాలంలో ఏపుగా
పెరుగుతుంది.అందుకే ఈపత్రంతో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకూ బ్రహ్మాదిదేవతలను పూజించాలని చెబుతారు. ఇది భూతబాధలనీ శరీరదుర్గంధాన్నీ హరిస్తుంది.ముఖ్యంగా దవనానికి వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది.ఈఆచారం వెనకున్న అసలు కిటుకు ఇదే.దవనంతో పాటు వసంతంలో విరివిగా పూసే మల్లెలకీ ఈశక్తి ఉంది. అందుకే మరువం,మల్లెలు కలిపికట్టే మాలలే ఈకాలంలో దేవతా విగ్రహాలకీ ఎక్కువగా అలంకరిస్తారు.
ఉగాది పచ్చడి….
ఉగాది అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్పతనం అంతా ఉగాది పచ్చడి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయాణాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ పండుగ ..కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు.
ఉగాది పచ్చడి ఆంతర్యం..
కొత్త సహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, ఆనంద విషాదాలను సమన్వయంతో, సానుకూల దృక్పధంతో స్వీకరించాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి. షడ్రుచులు కలయిక వేప పువ్వు పచ్చడి. ఈ షడ్రుచుల పచ్చడిని తినడం వెనుక జీవిత సారం గోచరిస్తుంది. ఈ పచ్చడి మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. తీపి సుఖ సంతోషాలను, పులుపు బాధలను, ఒగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది.
ముందస్తు ఉగాది శుభాకాంక్షలు…
పాఠకులకు,వీక్షకులకు,గ్రూప్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లకు పెద్దలకు పిల్లలకు రేపు రాబోవు ఉగాది సందర్భంగా …..
*తీపి, చేదు కలగలిపినదే జీవితం.. కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది.
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ విశ్వాసవసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు