

తెలంగాణ మోడల్ పరిపాలన అందించడం తమ ద్వేయం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్యక్రమానికి హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
బిల్డ్‌నౌ సేవలకు శ్రీకారం
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పారదర్శకమైన “తెలంగాణ మోడల్” పరిపాలన అందించడం తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల మంజూరులో పూర్తి ఆన్‌లైన్‌లో సత్వర సేవలను అందించే విధంగా మున్సిపర్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిల్డ్‌నౌ పోర్టల్‌ను రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తర్వాత నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి ఈ సందర్భంగా అనుమతి పత్రాలను అందించడం ద్వారా బిల్డ్‌నౌ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి,హైదరాబాద్ మేయర్ విజయలక్మి ,షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య,విజయ రెడ్డి,తదితరులు హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా సమాజంలో పెద్ద చిన్న అన్న తారతమ్యం లేకుండా అందరికీ సమాన, సత్వర సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్‌లైన్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకొచ్చినట్టు చెప్పారు.గతంలో మాన్యువల్‌గా జరిగినప్పుడు అనేక అవకతవకలకు, అక్రమాలకు ఆస్కారం ఉండింది. కొందరు పెద్దవాళ్లకు ఆన్‌లైన్ విధానం అమలు చేయడం వల్ల కొంత బాధ ఉండొచ్చు. ఏదైనా ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు కచ్చితంగా కొందరికి ఇబ్బంది ఉంటది. ఇప్పుడు పేదోడు, పెద్దోడు అన్న తేడా లేదు. అందరూ పబ్లిక్ డొమైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందే. అనుమతుల కోసం బిల్డ్‌నౌలో అప్‌లోడ్ చేయాల్సింది. పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యాప్ తీసుకొచ్చాం అని వివరించారు.