

టాటా రెన్యువబుల్ ఎనర్జీతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందం
ఈ ఒప్పందం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.49వేల కోట్ల పెట్టుబడులు
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో వచ్చే అయిదేళ్లలో 10లక్షలకోట్ల పెట్టుబడులు లక్ష్యం
మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఒప్పందం
అమరావతి: భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో పేరెన్నికగన్న టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఎపి ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం ( MOU ) కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ, ఎపి ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగు. ఈ ఒప్పందం ప్రకారం టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 7 గిగావాట్ల (7వేల మెగావాట్లు) పునరుత్పాదక ఇంధన (RE) అభివృద్ధి అవకాశాలను అన్వేషిస్తాయి. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సుమారు 49వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయి. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో టాటా రెన్యువబుల్ ఎనర్జీ అగ్రస్థానంలో నిలవనుంది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు దోహదపడటమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తూ వారి జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీలో భాగంగా టాటా రెన్యువబుల్ కు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్సఫర్మేషన్ ను వేగవంతం చేయాలన్న సిఎం చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఇదొక ఒక మైలురాయిగా నిలుస్తుంది. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 10లక్షల కోట్ల పెట్టబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో రెన్యూవబుల్ ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ భాగస్వామ్యం కావడాన్ని స్వాగతిస్తున్నాం. టాటా గ్రూప్, ఎపి ప్రభుత్వం నడుమ దీర్ఘకాలిక సంబంధాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది. పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను ఎంఓయు దోహదపడుతుంది. క్లీన్ ఎనర్జీ విస్తరణను వేగవంతం చేయాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రంలో రానున్న అయిదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో రూ .10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. స్థలం గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనలో టాటా రెన్యువబుల్ సంస్థకు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (NREDCAP) మద్దతునిస్తుంది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. భారతదేశం క్లీన్ ఎనర్జీ మిషన్‌కు మద్దతు ఇవ్వడంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు.
టాటా రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సిఇఓ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దీపేష్ నందా మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది. ఎపి ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మా నైపుణ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఈ ఒప్పందం మద్దతునిస్తుంది. 7గిగావాట్ల వరకు స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వల్ల పునరుత్పాదక ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలోపేతమవుతుంది. భారతదేశ పునరుత్పాదక ఇంధనరంగంలో స్థిరమైన లక్ష్యాలకు దోహదపడుతుంది. రాష్ట్ర సామాజిక-ఆర్థిక వృద్ధికి, బలమైన ఆర్థిక వ్యవస్థకు సహాయకారిగా నిలుస్తుందని దీపేష్ నందా చెప్పారు. ఈ కార్యక్రమంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ సిఎఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ (ప్లానింగ్ రెన్యువబుల్స్) తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్టాటజీ) గరిమా చౌదరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండి కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ (విండ్ & సోలార్) కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.