

జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం
రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
సభలో బీఆర్ఎస్ ఢిల్లీకి పంపే మూటల విషయాలు చర్చకి వస్తాయన్నే మా గొంతు నొక్కుతున్నారు
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 13 :-
తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్ఎస్ శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు విమర్శించారు. అనని మాటల్ని అన్నట్టుగా చెప్పి అబద్దాల ఆధారంగానే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమిషన్లు, ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు చర్చకి వస్తాయనే భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సస్పెన్షన్ కు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిరసన తెలిపిన కేటీఆర్, సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు జరుపుతామన్నారు. నిన్న ఉభయ సభల్లో గవర్నర్ చేసిన ప్రసంగంలోని అసత్యాలు, అర్థసత్యాలను ఎత్తిచూపుతున్న జగదీశ్వర్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు కేటీఆర్. అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ శాసనసభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ ప్రసంగానికి అంతరాయం కలిగించినా కూడా జగదీశ్వర్ రెడ్డి ఏమాత్రం సంయమనం కోల్పోలేదన్నారు. ఎండిపోతున్న పంటలు , అధోగతిపాలైన వ్యవసాయం,రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ ,పడని రైతుబంధు, అమలుగాని ఆరు గ్యారెంటీలు, 420 హామీల వాగ్దాన భంగం మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం నీతి బాహ్యంగా , నిస్సిగ్గుగా జగదీశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేసిందన్నారు. ఆయన ఎక్కడా అన్ పార్లమెంటరీ పదాలు వాడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక తండ్రిగా ప్రతిపక్ష నాయకుల హక్కులు కాపాడాలని ఆక్రోశం వ్యక్తం చేశారే కాని ఎక్కడా స్పీకర్ ని అగౌరవపరచలేదన్నారు. వాస్తవం ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన నియంతృత్వ పోకడలతో ఐదు గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ఈ చర్య తీసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయమన్న కేసీఆర్ ఆదేశాలతో స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి మూడ్ ఆఫ్ ది హౌజ్ తెలుసుకోవాలని తాము చేసిన సూచనను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జగదీశ్వర్ రెడ్డిని కనీసం వివరణ కూడా అడగకుండా, ఏం తప్పు చేశారో చెప్పకుండానే సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దురంహకారానికి నిదర్శమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని సంకెళ్లతో బంధించిన నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమిషన్లు, ఢిల్లీకి పంపే మూటల విషయాలు చర్చకి వస్తాయన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపడం మీద తప్ప పేదలకు మంచి చేసే విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం శ్రద్ద లేదన్న సంగతి ప్రజలకు కూడా అర్థమైందన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ కు ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. ఒక గొంతు నొక్కినంత మాత్రాన ఏదో సాధించామని భ్రమ పడతున్న కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార నియంత్రత పోకడలకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు
