

గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!
ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశం
డిగ్రీ లేదంటే ఇంటర్ అర్హతతో పాటు ఐదేండ్ల అనుభవం తప్పనిసరి
గైడ్లైన్స్తోపాటు జాబ్చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సేవలను పునరుద్ధరించాలని భావిస్తున్న ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి ఒక గ్రామ పాలన అధికారి(జీపీవో)ని నియమించే ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం10,954 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించగా, ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శనివారం జారీ చేశారు. పాత వీఆర్వో, వీఆర్ఏలకు మాత్రమే గ్రామ పాలన అధికారులు(జీపీవో)గా అవకాశం కల్పించనున్నారు. రెవెన్యూ పరిపాలన మీద అవగాహన, రిపోర్టులు రాయగల సామర్థ్యం కలిగిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. బీఆర్ఎస్ హయాంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖలకు పంపిన వీఆర్వోలు, వీఆర్ఏలు ఆయా చోట్ల జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, వీరిని నేరుగా తీసుకోకుండా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా జీపీవోలుగా ఎంపిక చేయనున్నారు. ఆయా బాధ్యతలు, విధులు నిర్వహించేందుకు అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నాయో లేవో ఈ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఎంపిక, జీపీవోల నియామకపు ప్రక్రియను సీసీఎల్ఏ నేరుగా గానీ, ఆయన నియమించే ఇతర అధికారి ఆధ్వర్యంలో గానీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. నియామకపు ప్రక్రియకు జిల్లాల్లో కలెక్టర్లు నేతృత్వం వహిస్తారు. ప్రస్తుత పే స్కేల్ ప్రకారమే వేతనాలు ఉంటాయి. అభ్యర్థులకు ఏదైనా వర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఇంటర్మీడియెట్ తో పాటు ఐదేండ్ల అనుభవం ఉండాలి. రెగ్యులర్ సర్వీసులో వీఆర్ఏగా ఉండి ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ గా చేస్తూ ఉండాలి. టెస్ట్ ల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. రెవెన్యూ శాఖలో వీఆర్ఓ, వీఆర్ఏల పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇతర సర్వీసు మ్యాటర్ ను భవిష్యత్లో ప్రకటించనున్నట్లు తెలిపారు