

గుడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం..
ఉగాది రోజున హుజూర్‌నగర్‌లో సీఎం ప్రారంభిస్తారు: మంత్రి ఉత్తమ్
క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలూ అందిస్తం
క్యూఆర్ కోడ్‌తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తం
రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి
హైదరాబాద్ : వచ్చే నెలఒకటో తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ”ఈ నెల 30న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తాం. క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తాం’ అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించనున్నామని, రాష్ట్రంలోని 85 శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. రేషన్కార్డు ఉన్నా లేకున్నా.. లబ్ధిదారుల లిస్టులో పేరున్నోళ్లందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని అన్నారు. ”అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు అందజేస్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం. ఆయా కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఉంటాయి. అందులో ఎలాంటి చిప్ఉండదు’ అని స్పష్టం చేశారు.
ఇకపై ఎక్కడైనా రేషన్..
గత కొన్నేండ్లుగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, కానీ తాము ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వనున్నామని ఉత్తమ్ చెప్పారు. డ్రా సిస్టమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో ఉండాలా? లేదా? అన్న అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ”గత పదేండ్లలో 49,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 90 లక్షల కార్డులు, 2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పుడు ఇవ్వనున్న కొత్త రేషన్ కార్డులు కూడా కలిపితే కార్డుల సంఖ్య కోటి దాటుతుంది. లబ్ధిదారులు 3.10 కోట్లకు చేరుతారు. బీపీఎల్ కుటుంబాలకు ఎరుపు రంగు కార్డులు, ఏపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ఇస్తాం’ అని వెల్లడించారు. ”రేషన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రూ.5,489 కోట్లు కేంద్రం, రూ.5,175 కోట్లు రాష్ట్రం భరిస్తున్నది. కొత్త కార్డుల జారీ తర్వాత మొత్తం వ్యయం రూ.13,523 కోట్లకు చేరుకుంటుంది’ అని వివరించారు. ”ప్రస్తుతం దొడ్డు బియ్యం ఇస్తుండడంతో చాలామంది వినియోగించడం లేదు. దీంతో డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్ముకుంటున్నారు. సన్న బియ్యం పంపిణీ చేస్తే, అందరూ వాటినే వాడుకుంటారు. బ్లాక్మార్కెట్కూడా పూర్తిగా తగ్గిపోతుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయిన వానాకాలంలో 24 లక్షల టన్నుల సన్నొడ్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.