

కేసీఆర్ వర్క్ ఫ్రమ్ హోమా లేక.. వర్క్ ఫ్రమ్ ఫామ్‌హౌసా?: సీఎం రేవంత్..
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ఎద్దేవా చేశారు. 15 నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా జీతభత్యాలు పొందుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇప్పటివరకూ రూ.57 లక్షల జీతం తీసుకుని కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. నిద్రపోయే వారిని లేపొచ్చు కానీ.. నటించే వారిని లేపలేం. సభకు వచ్చి కేసీఆర్ విలువైన సూచనలు ఇవ్వాలి. ఆయన సభకు రాకుండానే లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రారు.. ఆయన తన నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించరు. రైతుల ఆత్మహత్యలకు వారి అప్పులే ప్రధాన కారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ కింద చెల్లించాం. అన్నదాతలకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ ఇస్తున్నాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండానే 1.57 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాంధించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని ప్రజలే అంటున్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే రైతులకు నీరిస్తున్నాయి.
ఎన్నికల కోడ్ సాకుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక రైతుబంధు చెల్లించాం. భూమి లేని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇచ్చాం. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే పథకం తెచ్చాం. కాళేశ్వరం నుంచి చుక్కనీరు లేకుండా రికార్డు స్థాయి పంటలు పండాయి. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అన్నారు. కానీ మేం మొత్తం ధాన్యం కొనుగోలు చేశాం. అలాగే మహిళా సాధికారతకు ఎన్నో పథకాలు చేపట్టాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దాని కోసం రూ.1,775 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒక్క మహిళకైనా మంత్రి పదవి ఇచ్చారా?. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మా లక్ష్యం. మహిళా సంఘాలకు వెయ్యి ఆర్టీసీ అద్దె బస్సులు ఇచ్చాం. వారికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు అందిస్తాం. కేసీఆర్ విషయంలో స్టేచర్‌పై మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామని” చెప్పారు.
కాగా, తెలంగాణ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు..