

కన్నడ నటి రన్యారావుపై కేసు నమోదు చేసిన సీబీఐ
మనోరంజని ప్రతినిధి మార్చి 09
బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో కీలక పరిణామం
బంగారం అక్రమ రవాణా కేసును టేకప్ చేసిన సీబీఐ
డీఆర్ఐ కస్టడీలో ఉన్న నటి రన్యారావు
త్వరలో సీబీఐ అధికారులు అదుపులోకి రన్యారావు
కన్నడ నటి రన్యారావు (34) ఇటీవల దుబాయ్ నుండి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీ డాక్టర్ కె. రామచంద్రరావు పేరు ఉపయోగించి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆమె వద్ద నుంచి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఆర్ఐ విచారణలో ఆమె తరచుగా దుబాయ్ వెళ్లి వస్తూ బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో రన్యారావుపై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. దీంతో వారు త్వరలో రన్యారావును విచారించే అవకాశం ఉంది.
రన్యారావు వద్ద నుంచి ఇప్పటికే రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.17.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అనుమతితో ఆమెకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ప్రస్తుతం రన్యారావును డీఆర్ఐ అధికారులు కస్టడీలో ఉంచుకుని విచారణ చేస్తుండగా, అక్కడ విచారణ అనంతరం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
రన్యారావు కాల్ డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబైలలో కూడా సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.