

ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు… రేవంత్ కీలక ఆదేశాలు
సహాయక చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ ను నియమించాలన్న రేవంత్
సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని ఆదేశం
నిపుణుల సలహాలతో ముందుకు వెళ్లాలని సూచన
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు చేపట్టి నెల రోజులు దాటినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఈ క్రమంలో ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సహాయక చర్యలు నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సహాయక చర్యలు త్వరగా జరిగేలా చూడాలని చెప్పారు. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులను త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలను నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.