

ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్
మనోరంజని మంచిర్యాల జిల్లా ప్రతినిధి. మార్చి 21 :-ఎల్.ఆర్.ఎస్.-2020 పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత గల వారు రుసుము చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ కార్యదర్శి బుద్ద ప్రకాష్ జ్యోతి, జోనల్ కమీషనర్ అపూర్వ లతో కలిసి జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి లేని లే-అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. లే-అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులలో అర్హులైన దరఖాస్తుదారులు ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి ఫీజు చెల్లించినట్లయితే 25 శాతం ఫీజు తగ్గించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంపై ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు వివిధ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారం అందించి ఫీజు చెల్లించే విధంగా విస్తృత ప్రచారం చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్.-2020 పథకంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడు రుసుము చెల్లించేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఎఫ్.టి.ఎల్. / నిషేధిత భూములకు సంబంధించి ఎల్-2 లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగిందని, నూతన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, రుసుము చెల్లించిన వారికి పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. మున్సిపల్ కమీషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, మండల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణాలు అధికంగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎల్.ఆర్.ఎస్.-2020 పథకంలో అర్హులైన అభ్యర్థుల నుండి రుసుము చెల్లించే విధంగా జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుల మొబైల్ నంబర్, చిరునామా వివరాలు తీసుకోవడం జరిగిందని, వారికి ఫోన్ కాల్ చేసి రుసుము చెల్లింపు వివరాలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఎఫ్.టి.ఎల్. /నిషేధిత భూములకు సంబంధించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యమ్రంలో మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు