

ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ
బాధితురాలు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న సమయంలో ఘటన జరిగిందని వెల్లడి
యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందన్న ఎస్పీ
ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై రైల్వే పోలీసు ఎస్పీ చందనదీప్తి మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, నిన్న సాయంత్రం 26 ఏళ్ల యువతి ఎంఎంటీఎస్ రైలులోని మహిళా కంపార్టుమెంటులో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో ఆమె ఎక్కినప్పుడు ఇద్దరు మహిళలు ఉన్నారని, వారు అల్వాల్ స్టేషన్ వద్ద దిగిపోయారని తెలిపారు. అదే కంపార్టుమెంటులో ఉన్న వ్యక్తి తన వద్దకు వచ్చి గట్టిగా పట్టుకున్నట్లు యువతి తెలిపిందని, ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని అన్నారు. అతను ఏమైనా చేస్తాడేమోననే భయంతో యువతి రైలులో నుంచి దూకేసిందని ఎస్పీ తెలిపారు. నిందితుడిని గుర్తు పట్టలేనని బాధితురాలు చెబుతోందని, కానీ అతను ఎక్కడ ఎక్కాడో చెప్పగలనని తమకు తెలిపిందని ఆమె వెల్లడించారు. యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందని ఎస్పీ తెలిపారు. నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు