

ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీలో అధికారులు ఆంక్షలు విధించారు. క్యాంపస్‌లో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదులపై అధికారులనే కలవాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఓయూ టీచర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సర్క్యులర్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఓయూ రిజిస్ట్రార్ ఏమన్నారంటే..
ఓయూలో ఆందోళనల నిషేధంపై ఓయూ రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు. ఓయూ క్యాంపస్ లోపల ధర్నాలపై పూర్తిగా నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ విభాగాలు, పరిపాలనా భవనాల్లో మాత్రమే ధర్నాలు నిషేధమని చెప్పారు. విద్యా, పరిపాలనా విధులకు ఆటంకం కలగకుండా మాత్రమే సర్క్యులర్ ఇచ్చామని స్పష్టం చేశారు. మార్చి 13, 2025న జారీ చేసిన సర్క్యులర్‌పై ఆందోళనలు, అపోహలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడూ విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను గౌరవించిందని చెప్పారు. విద్యార్థుల న్యాయమైన ఉద్యమాలను గుర్తిస్తుందని ఓయూ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.