

ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు. కోర్టు వివాదం నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేసింది. 2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనలు తిప్పి పంపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. KP