అమ్మ శ్రమలో ఎన్ని రంగులో..!!

అమ్మ శ్రమలో ఎన్ని రంగులో..!!

ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ.
బాబు షూస్‌ పాలిష్‌ చేయాలి కదా నల్లగా.

పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్‌.
బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్‌ కలర్‌ పాత్రలే.
కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే.
లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి.
నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.

ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్‌ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి. అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్‌ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్‌లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్‌ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్‌ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్‌ వాషర్‌ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్‌ కాన్షియస్‌నెస్‌ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్‌లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు. ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా. అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం… తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్‌స్టిక్‌ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్‌ అమ్మకే అంకితం. గ్యాస్‌ స్టవ్‌ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్‌ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్‌ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్‌వర్క్‌లు చేయిస్తే బాల్‌పాయింట్‌ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది. ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్‌ చెప్పండి

  • Related Posts

    అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

    అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243 కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్ (83), సింగపూర్ (19) దేశాలకు…

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం? US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం