

అకాల వర్షానికి….దెబ్బతిన్న మొక్కజొన్న పంటలు…!
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్తోపాటు వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి బలమైన గాలులతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట దెబ్బతింది. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది రైతులు మొక్కజొన్న సాగును గత పది సంవత్సరాల నుండి అధిక విస్తీర్ణంలో చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు ధరసైతం ఆశాజనకంగా ఉండడంతో మొక్కజొన్న సాగుపై రైతులు ఆసక్తి చూపారు. మొక్కజొన్న పంట కోతకు వచ్చిన సమయంలోనే బలమైన ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. దీంతో పంట నేలకొరిగి రైతన్నకు నష్టాన్ని మిగిలించింది. అదేవిధంగా మామిడి తోటల్లో సైతం మామిడి కాయలు రాలిపోయాయి. చేతికి వచ్చే దశలోనే పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. అకాల వర్షం తమను ఆర్థికంగా నష్టాన్ని మిగిలించిందని వాపోతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో రైతులు కూరగాయ పంటను సైతం సాగు చేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో టమాటా తో పాటు వంకాయ- బెండకాయ పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో మామిడి తోటను కౌలుకు తీసుకున్న షఫీ ఉల్లా ఖాన్( బాబా)కు అకాల వర్షం దాదాపు 60 వేల నుండి 70 వేల లోపు నష్టాన్ని కలిగించింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంటలు నష్టపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రజా ప్రతినిధులు- అధికారులు ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాతావరణ శాఖ మరో రెండు రోజులపాటు బలమైన ఈదురుగాలో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు

