

మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్..
అధ్యయనంలో వెల్లడి!
ఇంటర్నెట్ డెస్క్: మద్యంపానం ఆరోగ్యానికి హనికరమని అందరికీ తెలిసిందే. మద్యానికి బానిసైన అనేక మంది తమ ఒళ్లు, జేబులు గుల్ల చేసుకుని చివరకు ఈ లోకాన్నే వీడారు. అయితే, ఇంతటి ప్రమాదకరమైన మద్యపానం అలవాటుకు సంబంధించి హార్డర్వ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఆసక్తికర అంశాన్ని కనుగొన్నారు. మద్యంపానంతో శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. జపాన్‌లో 58 వేల మందిపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలన్ని గుర్తించారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం తాగడం ప్రారంభించిన వారిలో చెడు కొలెస్టరాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్టరాల్ స్థాయిలు పెరిగాయి. మరోవైపు, మద్యపానం మానేసని వారిలో ఇందుకు విరుద్ధంగా చెడు కొలెస్టరాల్ స్థాయిలు పెరిగాయి. ఓ మోస్తరు మద్యపానం చేసే వారిలో గుండె, స్ట్రోక్ ముప్పు కూడా కాస్త తగ్గిందని చెబుతున్నారు. మరి మద్యపానం మంచిదా అంటే అస్సలు కాదని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ వ్యసనంతో లివర్ సమస్యలు, హైబీపీ, ఇతర ప్రమాదాలతో పాటు పలు క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొలెస్టరాల్ స్థాయిలపై మద్యపానం ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఇతర అనారోగ్యాల ముప్పు మాత్రం చాలా ఎక్కువని స్పష్టం చేశారు. మద్యపానం కారణంగా ఒంట్లో అధికంగా కెలరీలు చేరి చివరకు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇందులోని చక్కెర కారణంగా ఒంట్లో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగి చివరకు గుండె, పాక్రియాస్‌కు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీంతో, కోలోరెక్టల్ బ్రెస్ట్, లివర్, నోటి సంబంధిత క్యాన్సర్‌ల ముప్పు కూడ గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ప్రజారోగ్యానికి మద్యపానం గొడ్డలి పెట్టు అని కూడా తేల్చి చెప్పారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం, కొవ్వులు తగ్గించుకునేందుకు ఉన్న ఏకైనా మార్గం ఆరోగ్యకరమైన జీవన శైలి అవలంబించడమే. పోషకాహారం, క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వంటివి వాటితో కొవ్వు సులువుగా తగ్గి కలకాలం ఆరోగ్యంగా జీవించొచ్చు.